: ఉత్తరప్రదేశ్లో బులంద్ షహర్ తరహా మరో దారుణ ఘటన?
ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ లో తల్లీకూతుళ్లపై కామాంధులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన మరవకముందే అదే రాష్ట్రంలో అటువంటి మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. అలీఘడ్ జిల్లాలోని కాస్గంజ్లో దంపతులపై ఓ గ్యాంగ్ దారుణంగా దాడి చేసింది. భర్తను కత్తితో పొడిచిన దుండగులు అతడి కళ్లముందే అతడి భార్యపై లైంగిక దాడి చేసినట్లు తెలుస్తోంది. దంపతులు గంగా నదిలో పుణ్యస్నానానికి వెళ్లి సైకిల్‌పై వస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మహిళపై లైంగిక దాడి చేసిన అనంతరం ఆమెను కూడా దుండగులు గొంతునులిమి హత్యచేశారు. బాధితులని సునీల్ కుమార్ దంపతులుగా పోలీసులు గుర్తించారు. సునీల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ ఘటన విషయంలో భర్త చెబుతున్న కథనాన్ని పోలీసులు పూర్తిగా విశ్వసించడం లేదు. బాధితురాలిని అత్తమామలు, భర్త గత కొన్నాళ్లుగా కట్నం వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సునీల్ కుమార్ పై తాము వేసిన ప్రశ్నలకు అతని నుంచి సరైన సమాధానాలు కూడా రాలేదని చెబుతున్నారు.