: జడ్జి ఫోన్ చేస్తే...అంబులెన్స్ గాల్లో ఎగిరి వస్తుందా?: అంబులెన్స్ ఆపరేటర్ సమాధానం
ప్రభుత్వ పథకాలు ఎంత గొప్పగా అమలవుతున్నాయో తెలిపే ఘటన హర్యాణాలో చోటుచేసుకోగా, అదే ఘటన ఓ జడ్జికి ఊహించని పాఠం నేర్పింది. వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా హర్యానాలోని రోహ్ తక్ దగ్గర్లోని పంచకుల గ్రామానికి చెందిన జగ్దీప్ సింగ్ పని చేస్తున్నారు. వీకెండ్, వినాయకచవితి కలిసి రావడంతో ఆయన స్వగ్రామానికి వెళ్లారు. గ్రామం నుంచి తిరిగి వెళ్తుండగా...రహదారిపై వేగంగా వస్తున్న కారు ఓ మోటారు సైకిల్ ను ఢీ కొట్టింది. దీంతో నలుగురు గాయపడ్డారు. దానిని చూసిన జడ్జి వెంటనే 102 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమని కోరారు. దీనిని పట్టించుకోని 102 అంబులెన్స్ ఆపరేటర్...జగ్దీప్ సింగ్ వివరాలు నమోదు చేసుకున్నాడు. దీంతో ఆయన తాను జడ్జినని, ప్రమాదంలో ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారని, వెంటనే అంబులెన్స్ పంపించాలని కోరారు. దానికి ఆ ఆపరేటర్...'నువ్వు జడ్జివైతే... ఫోన్ చెయ్యగానే అంబులెన్స్ గాల్లోంచి ఎగిరి వస్తుందా? వచ్చేవరకు ఎదురు చూడు' అంటూ దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో విషయం అర్థం చేసుకున్న జగ్దీప్ సింగ్, స్థానికుల సాయంతో క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి, జింద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టరు సంజయ్ దహియాను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై దహియా మాట్లాడుతూ, జడ్జి ఫిర్యాదుపై అంతర్గత విచారణ ప్రారంభిస్తామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.