: ఏపీకి ప్యాకేజీ ప్రకటన కోసం మేమూ ఎదురుచూస్తున్నాం.. ప్రకటన వస్తుంది: పురంధేశ్వరి
బీజేపీ ఆంధ్రప్రదేశ్ నేతలు ఎప్పటికప్పుడు ఢిల్లీకి వెళుతూనే ఉన్నారని, రాష్ట్ర పరిస్థితులని కేంద్ర పెద్దలకు వివరిస్తూనే ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. ఈరోజు విశాఖ పట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ఈరోజు మధ్యాహ్నం ఏపీకి తమ పార్టీ కేంద్ర మంత్రులు చేసే ప్యాకేజీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు. కేంద్రం ఇక ముందు కూడా ఏపీని అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు. గత నెల 23న అమిత్ షా అధ్యక్షతన జరిగిన కోర్‌కమిటీ భేటీలో తాము ఏపీ పరిస్థితుల్ని వివరించామని పురంధేశ్వరి అన్నారు. ప్యాకేజీతో హోదా కన్నా ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయని ఆమె అన్నారు. జైట్లీ, వెంకయ్య కలిసి ప్యాకేజీ అంశాన్ని ప్రకటిస్తారని ఆమె అన్నారు. ఏపీకి రైల్వేజోన్ తప్పకుండా వస్తుందని అన్నారు. అయితే విశాఖ కేంద్రంగా వస్తుందని చెప్పలేమని పేర్కొన్నారు. ఏపీకి న్యాయం చేసేందుకే అన్ని విధాల కృషి చేస్తున్నామని చెప్పారు.