: కొత్త డిమాండ్ అందుకున్న ‘సీమ’ నేతలు!... తిరుపతి కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్!
ఏపీకి ప్రత్యేక హోదాకు తిలోదకాలిచ్చి, స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీకి కేంద్రం రంగం సిద్ధం చేస్తున్న తరుణంలో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. రాయలసీమ పోరాట సమితి పేరిట రంగంలోకి దిగిన కొందరు నేతలు నేటి ఉదయం తిరుపతిలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు తిరుపతి కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు వీలు కాకపోతే... విజయవాడ మినహా ఏ ప్రాంతం కనిపించలేదా? అని వారు ప్రశ్నించారు. విశాఖ, విజయవాడలను మాత్రమే అభివృద్ధి చేసి రాయలసీమకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని, అదే జరిగితే ఏపీ అగ్ని గుండంగా మారుతుందని హెచ్చరించారు. తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్ ను ప్రకటించడమే కాకుండా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.