: రాజస్థాన్, కోటాలోని రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై బాంబు బ్యాగులు
రాజస్థాన్ లోని కోటాలోని రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై బాంబు బ్యాగులు కలకలం రేపాయి. వివరాల్లోకి వెళ్తే... కోటాలోని రైల్వే స్టేషన్ లోని 1వ నెంబర్ ప్లాట్ ఫాం మీద సాయంత్రం 4:30 నిమిషాల సమయంలో రెండు బ్యాగులు అనుమానాస్పద స్థితిలో కనిపించాయి. వాటి గురించి ఆరాతీయగా వాటికి సంబంధించిన వారెవరూ లేకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ ను రప్పించి తనిఖీలు నిర్వహించగా, ఆ రెండు బ్యాగుల్లోనూ పేలుడు పదార్థాలు ఉన్నాయని వారు గుర్తించారు. దీంతో బాంబ్ స్క్వాడ్ వాటిని పరిశీలించగా... అందులో 2.75 కేజీల విద్యుత్ తీగలు, డిటోనేటర్లు ఉన్నట్టు నిర్ధారించారు. ఈ రెండింటిని వేర్వేరు బ్యాగుల్లో ఉంచినట్టు వారు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు అందించేందుకు పోలీసులు నిరాకరించారు. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ముంబై నుంచి ఢిల్లీకి రాజస్థాన్ మీదుగా వెళ్లే రైళ్లకు కోటా రైల్వే స్టేషన్ కీలకమైనది!