: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన రేవంత్‌రెడ్డి
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంటోన్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తరువాతే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయాల మేరకే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాపై కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. కొత్త మండలాల ఏర్పాటు కూడా ప్రజాభిప్రాయం ప్రకారమే జరగాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఒక నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే జిల్లాలో ఉండేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. అంతర్ జిల్లా ప్రాజెక్టులపై ప్రభుత్వం సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాల కోసం పలు ప్రాంతాల ప్రజలు చేస్తోన్న డిమాండ్లకు తమ పార్టీ మద్దతునిస్తుందని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అఖిలపక్షం చేసిన సూచనలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక ఏంటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.