: ప్రాజెక్టులకు డబ్బు కోసం ఢిల్లీకి హరీశ్ రావు!
ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్ వై) కింద గుర్తించిన 11 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కోసం నాబార్డుతో ఒప్పందం కుదుర్చుకునేందుకు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఈ ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. జలవనరుల సమన్వయ కమిటీ సభ్యుడి హోదాలో ఉన్న ఆయన, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒప్పందాలపై సంతకాలు పెట్టనున్నారు. దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులివ్వాలని పీఎంకేఎస్ వై నిర్ణయించగా, అందులో 11 తెలంగాణ ప్రాజెక్టులకు స్థానం లభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి చెందిన కొమురం భీం, ర్యాలీవాగు, ఎస్సారెస్పీ-2, మత్తడివాగు, పెద్దవాగు, గొల్లవాగు, పాలెం వాగు, దేవాదుల, జగన్నాథ్‌పూర్ , భీమా, వరద కాల్వలు నిర్మాణానికి నిధుల కోసం హరీశ్ రావు డీల్స్ కుదుర్చుకోనున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కృష్ణానది యాజమాన్య బోర్డు వ్యవహరిస్తోందని కేంద్రానికి తెలంగాణ తరఫున హరీశ్ ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది.