: నయీం కేసులో ప్రముఖుల అరెస్టుకు రంగం సిద్ధం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెన్నులో వణుకు!
గ్యాంగ్‌స్టర్ నయీం కేసును దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో వణుకు మొదలైంది. నిన్నమొన్నటి వరకు నయీం బంధువులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా ‘ప్రముఖుల’పై దృష్టి సారించారు. సిట్ విచారణలో కొందరు ప్రముఖుల పేర్లు కూడా తెరపైకి రావడంతో ఆ దిశగా దర్యాప్తు సాగించిన సిట్ నయీంకు సహకరించిన వారిలో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని తేల్చింది. నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ కూడా విచారణలో ఇదే విషయాన్ని పేర్కొన్నాడు. దీంతో వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని సిట్ భావిస్తోంది. క్విడ్ ప్రో కోలో భాగంగా కొందరు రాజకీయ నాయకులు నయీంకు బోల్డంత సమాచారం అందించినట్టు సిట్ చేతికి చిక్కిన పలువురు పేర్కొన్న సంగతి తెలిసిందే. కాల్‌డేటా కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. కొందరు రాజకీయ నేతల నుంచి నయీంకు ఫోన్ కాల్స్ వెళ్లినట్టు పోలీసు అధికారులు గుర్తించారు. ఎన్‌కౌంటర్‌కు కొన్ని రోజుల ముందు అధికార పార్టీ నేతతో నయీం పలుమార్లు ఫోన్లో మాట్లాడిన విషయం కాల్‌డేటాలో బయటపడింది. మొత్తం సమాచారాన్ని పూర్తిస్థాయిలో నిర్ధారించుకున్న సిట్ అధికారులు వినాయక నవరాత్రులు ముగిసేలోపు ప్రముఖుల అరెస్ట్‌ను పూర్తిచేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అరెస్టులకు సిట్ రంగం సిద్ధం చేసిందన్న విషయం తెలిసిన ‘ప్రముఖులు’ భయంతో వణికిపోతున్నారు. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్టు సమాచారం.