: ఏపీకి త్వరలో తీపి కబురు... అదేదో ముందే తెలిస్తే మజా పోతుందన్న వెంకయ్య!
ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో తీపికబురు అందుతుందని, అయితే అదేదో ముందే తెలిస్తే అందులో ఉన్న మజా పోతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఓ పత్రికకు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఏపీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు విసుగు రాదని, దేశాభివృద్ధి కోసం ఆలోచించడంలో విరామం ఉండదని పేర్కొన్న వెంకయ్య విభజన నష్టాన్ని పూడ్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అందులో భాగంగానే కేంద్రమంత్రులను తరచూ ఏపీకి తీసుకొచ్చి వారితో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయిస్తున్నట్టు పేర్కొన్నారు. తన మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రానికి రూ.36 వేల కోట్లు మంజూరు చేస్తే కొందరు దానిని ముష్టి అంటున్నారని తెలిపారు. అటువంటి విషయాలను తాను పట్టించుకోబోనన్నారు. ఏపీకి హోదా ఇచ్చినా కేంద్రం నుంచి అందే సాయం మాత్రం పదేళ్లపాటు కొనసాగాలనదే తన అభిమతమని వివరించారు. ఏపీ విభజన పాపం కాంగ్రెస్, బీజేపీదేనని కొందరు విమర్శిస్తున్నారని, కానీ ఒక్క సీపీఎం తప్ప అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన విషయాన్ని తెలుసుకోవాలని చురకలంటించారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే చరిత్రలో ఎన్నడూ లేనంత వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. సరైన కసరత్తు లేకుండా రాష్ట్రాన్ని విభజించడం వల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందన్న మంత్రి చట్టంలో పేర్కొన్న, నోటి మాట ద్వారా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. కొందరు చంద్రబాబును భయపెడుతున్నారని, ఆయన భయపడాల్సిన పని లేదని అన్నారు. హోదా విషయంలో కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. హోదా వస్తే అన్నీ వస్తాయని అనుకోవడం పొరపాటేనన్నారు. తానెప్పుడూ ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదని, అయితే రాష్ట్రాభివృద్ధికి అదే సంజీవని మాత్రం కాదని పేర్కొన్నారు.