: నువ్వా? నేనా? అంటున్న బీజేపీ, ఎస్పీ!... యూపీ ఎన్నికలపై కొత్త సర్వే!
దేశంలో పెద్ద రాష్ట్రంగానే కాకుండా... దేశ రాజకీయాల దిశనే మార్చేసే సత్తా ఉన్న ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపై సర్వేలు హోరెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రజల ముందుకు వచ్చిన వేర్వేరు సర్వేలు ఆ రాష్ట్ర ఎన్నికలపై పెద్ద చర్చకే తెర తీశాయి. తాజాగా వచ్చిన ‘ద ఇండియా టీవీ- సీ ఓటర్’ సర్వే మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. యూపీ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఈ దఫా అధికారం చేజిక్కించుకోవడం దాదాపుగా దుర్లభమనే రీతిలోనే ఈ సర్వే ఫలితాలున్నాయి. ఎలాగైనా ఈ దఫా యూపీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి ఎస్పీ కంటే కూడా కాస్తంత అధికంగానే సీట్లు వస్తాయని ఆ సర్వే చెబుతోంది. ఈ సర్వే ప్రకారం... ఎన్నికల్లో బీజేపీకి 134 నుంచి 150 మధ్య సీట్లు వస్తాయి. అదే సమయంలో ఎస్పీకి 133 నుంచి 149 సీట్లు వస్తాయి. వెరసి 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో ఈ రెండు పార్టీల్లో ఏ ఒక్క పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ రాదు. ఇక ఇప్పటికే అక్కడ ప్రచారం మొదలెట్టిన కాంగ్రెస్ కు 5 నుంచి 13 సీట్లు మాత్రమే దక్కనున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి 95 నుంచి 111 సీట్లు వస్తాయి. స్వతంత్ర అభ్యర్థుల ఖాతాలో 4 నుంచి 12 సీట్లు పడతాయి.