: వినాయక చవితి నుంచి జియో అఫీషియల్ లాంచ్, మూడు కాదు, నాలుగు నెలలు ఫ్రీ... ఆపై 1జీబీ రూ. 50కే: రిలయన్స్


వినాయక చవితి పర్వదినం సందర్భంగా రిలయన్స్ జియో అఫీషియల్ లాంచ్ ని సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ఆయన, 4జీ సేవలకు సంబంధించి సుదీర్ఘంగా ప్రసంగించారు. దేశంలోని ప్రజలందరికీ మరింత మెరుగైన తరంగాలను, తక్కువ ధరలకు డేటా, వాయిస్ సేవలను అందించడమే తమ లక్ష్యమని, ఈ విభాగంలో ఇతర టెల్కోలతో పోటీ పడబోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. మూడు నెలల పాటు రిలయన్స్ జియో ఎలా పనిచేస్తుందో కస్టమర్లకు తెలియజేయడం కోసమే ఉచిత సేవలను అందించాలని నిర్ణయించామని, కమర్షియల్ లాంచింగ్ తరువాత, డిసెంబర్ 31 వరకూ ఉచిత డేటా, వాయిస్, వీడియో, ఆప్స్ సేవలను అందుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 వరకూ ఎలాంటి చార్జీలనూ వసూలు చేయబోమని, ఆపై కూడా కేవలం రూ. 50కే 1 జీబీ డేటాను పొందవచ్చని ఆయన తెలిపారు. తమ కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించేందుకు అత్యాధునిక టవర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నామని వివరించారు. ఉచిత సేవలను అందుకుంటున్న కస్టమర్ల నుంచి వచ్చే విలువైన సలహాలు, సూచనలు పాటించి మరింత మెరుగైన సేవలను 2017 జనవరి 1 నుంచి వాణిజ్య రూపంలో అందిస్తామని, ఆపై కూడా నిత్యమూ విస్తరణపై దృష్టిని సారిస్తామని తెలిపారు. నేడు తాను రిలయన్స్ చరిత్రలో అతి ముఖ్యమైన ప్రకటన చేశానని, జియో ఇప్పటికే చాలా నగరాలు, పట్టణాలకు విస్తరించిందని, దాన్ని మారుమూల గ్రామాలకూ చేర్చాలన్నదే తన అంతిమ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం ఫైబర్ నెట్ వర్క్ ను నిర్మిస్తామన్నారు. డిసెంబర్ 2017 నాటికి 80 శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు దగ్గర కావాలన్న ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖేష్ అంబానీ తెలిపారు. స్మార్ట్ ఫోన్లను గరిష్ఠంగా వాడేవారి కోసం నెలకొల్పిన ప్లాన్ లో రూ. 4,999కి నెలకు 75 గిగాబైట్ల 4జీ డేటాను అందిస్తామని వివరించారు. నెలకు రూ. 149 ప్లాన్ లో 0.3 జీబీ 4జీ డేటాను ఉచితంగా అందిస్తామని తెలిపారు. స్టూడెంట్ల కోసం అదనంగా 25 శాతం డేటాను ఉచితంగా ఇస్తామని వివరించారు. దేశవ్యాప్తంగా వై-ఫై హాట్ స్పాట్ లను నెలకొల్పుతామని ముఖేష్ తెలిపారు. తామందించే అన్ని రకాల ప్లాన్ లలో ఉచిత వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ మెసేజ్ లు ఉంటాయని అన్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే దేశవ్యాప్త రోమింగ్ ను జియో అందిస్తుందని ముఖేష్ అంబానీ వివరించారు.

  • Loading...

More Telugu News