: బాబుతో చర్చల కోసం హైదరాబాదు బయల్దేరిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చల కోసం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీ నుంచి హైదరాబాదు బయల్దేరారు. నగరానికి చేరుకున్న వెంటనే ఆయన చంద్రబాబుతో సమావేశం అవుతారు. నేటి ఉదయం ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ప్రధాని మోదీతో సమావేశమైన వెంకయ్యనాయుడు, నేటి సాయంత్రం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన సంగతి తెలిసిందే. అనంతరం ఏపీకి ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజీపై బాబుతో చర్చించేందుకు ఆయన హైదరాబాదు బయల్దేరడం విశేషం. ఈ క్రమంలో భేటీ కోసం చంద్రబాబు కూడా హైదరాబాదుకు రానున్నట్టు తెలుస్తోంది. గత వారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి బహిరంగ సభలో చేసిన వాడివేడి వ్యాఖ్యలతో ఏపీకి ఏదో ఒకటి చేయాలని, లేని పక్షంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై ఏపీలో కాంగ్రెస్ పరిస్థితే తమకు కూడా ఎదురవుతుందని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి వీలైనంత త్వరలో ఏం చేయనున్నామో తెలిపే రోడ్ మ్యాప్ ను తయారు చేసే చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ఏపీ సీఎంతో వెంకయ్యనాయుడు సమావేశం కానున్నారు. మరో పది రోజుల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News