: సచిన్, లారా, పాంటింగ్‌లపై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు
పాక్ మాజీ క్రికెటర్ ‘వసీం అక్రమ్ టాక్ షో’లో పాల్గొన్న పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రపంచ మాజీ దిగ్గజ బ్యాట్స్‌మెన్ అయిన భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ ఆటగాడు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ రికీ పాంటింగ్‌లపై పలు వ్యాఖ్యలు చేశాడు. ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన దృష్టిలో మాత్రం వీరు ముగ్గురు అంత గొప్ప ఆటగాళ్లు కారని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. క్రికెటర్లలో గ్రేట్ బ్యాట్స్‌మెన్‌ల వికెట్లు పడగొట్టడం కష్టమయినా తాను దీటైన బౌలింగ్‌తో ఔట్ చేయగలిగానని షోయబ్ అక్తర్ అన్నాడు. అయితే, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ను ఔట్ చేయడం ఎంతో కష్టమని అన్నాడు. తాను ఇంజమాన్‌ని నెట్స్ లో ఒక్కసారి కూడా ఔట్ చెయ్యలేదని పేర్కొన్నాడు. ఇంజమామ్ ఫుట్ వర్క్ ఎంతో అద్భుతంగా ఉండేదని చెప్పాడు. అందుకే తనకు వచ్చే బంతిని కచ్చితంగా అంచనా వేసి ఇంజమామ్ దాన్ని ఎదుర్కునేవాడని పేర్కొన్నాడు. తన బౌలింగ్ ను ఎదుర్కొన్న బ్యాట్స్‌మెన్‌లలో ఆయనే అత్యుత్తమ బ్యాట్స్ మన్ అని షోయబ్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఇంజమామ్‌తో సరితూగే బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరని అన్నాడు. ఇంజమామ్‌తో ఏ బ్యాట్స్‌మెన్‌నీ పోల్చలేమని వ్యాఖ్యానించాడు.