: మూడు నెలల 'ఉచితం' తరువాత జియో ప్లాన్ ఏంటో స్వయంగా చెప్పనున్న ముఖేష్ అంబానీ
భారత టెలికం రంగంలో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో భవిష్యత్ ఏంటో, మూడు నెలల ఉచిత 4జీ డేటాను వాడుకున్న తరువాత టారిఫ్ ప్లాన్ ఎలా ఉంటుందన్న విషయాలను రేపు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా వెల్లడించే అవకాశాలున్నాయి. గురువారం నాడు రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగనుండగా, తన ప్రసంగంలో రిలయన్స్ జియో భవిష్యత్ ప్లాన్లే ముఖేష్ ప్రధానంగా ప్రస్తావిస్తారని కంపెనీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా రిలయన్స్ ఓన్ బ్రాండ్ 'లైఫ్' స్మార్ట్ ఫోన్లు వాడేవారికి మరింత తక్కువ ధరకు డేటాను ఇచ్చేలా ఆయన ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. స్పెషల్ ప్లాన్స్ తో పాటు కమర్షియల్ గా జియో ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న విషయాలను కూడా ఆయన స్వయంగా వెల్లడిస్తారని సమాచారం. ఇక మిగతా టెలికం సంస్థలు సైతం ముఖేష్ అంబానీ ఏం చెబుతారన్న విషయమై ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. ఇదే సమయంలో టారిఫ్ ప్లాన్ వివరాలను ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా)కి అందించడం తప్పనిసరైన నేపథ్యంలో ఆ పని కూడా త్వరలోనే ముగించాలని రిలయన్స్ జియో భావిస్తోందని సంస్థ అధికారి ఒకరు తెలిపారు.