: గంటన్నర పాటు వరుణుడి ప్రతాపం... హైదరా'బ్యాడ్'!
భాగ్యనగరిపై వరుణుడు తన ఆగ్రహాన్ని చూపాడు. ఈ ఉదయం దాదాపు గంటన్నరకు పైగా పడ్డ భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా, అన్ని ప్రధాన రహదారులపై రెండు నుంచి మూడడుగుల నీరు చేరుకుంది. రోడ్లపై వందలాది వాహనాలు నీట మునిగి ఎటూ కదల్లేని పరిస్థితిలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడగా, ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. పాతబస్తీలో గోడకూలి ఓ చిన్నారి మరణించగా, రామాంతపూర్, బోలక్ పూర్ ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఆరుగురు మరణించారు. నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 5 నుంచి 9 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు గంట ఆలస్యంగా విధులకు హాజరయ్యేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వర్షం ప్రారంభమయ్యే సమయానికే విద్యార్థులతో బయలుదేరిన వివిధ పాఠశాలల బస్సులు ట్రాఫిక్ జాంలో చిక్కుకోగా, చిన్నారులు ఏడుపులు లంఘించుకున్న పరిస్థితి నెలకొంది. బంజారాహిల్స్ మెయిన్ రోడ్డులో రెండు చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. తార్నాక, రామాంతపూర్, కూకట్ పల్లిలోని కొన్ని ప్రాంతాలు, టోలీచౌకీ, దిల్ సుఖ్ నగర్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వాహనదారులకు నరకం కనిపిస్తోంది. హైదరాబాద్ కుంభవృష్టిపై చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అత్యవసరమైతే తప్ప వర్షం పూర్తిగా నిలిచి, వరద నీటి ప్రవాహం తగ్గే వరకూ ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు.