: వన్డేల్లో ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు... 50 ఓవర్లలో 444 పరుగులు చేసి గత రికార్డులు బద్దలుగొట్టిన వైనం


వన్డేల్లో ఇంగ్లండ్ జట్టు సరికొత్త రికార్డు నెలకొల్పింది. అత్యధిక స్కోరుతో గత రికార్డులను చెరిపేసింది. నాటింగ్‌హామ్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ ఘనత సాధించింది. 50 ఓవర్లలో మూడంటే మూడు వికెట్లు కోల్పోయి ఏకంగా 444 పరుగులు చేసింది. గతంలో 9 వికెట్లు కోల్పోయి శ్రీలంక చేసిన 443 పరుగుల రికార్డును తిరగరాసింది. 2006 శ్రీలంక సాధించిన ఈ ఘనతను పదేళ్ల తర్వాత ఇంగ్లండ్ చెరిపేసింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ మరోమాట లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి నుంచే పాక్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ పాక్ బౌలర్లను ఊచకోత కోశారు. బంతులను కసితీరా బాదారు. బౌలర్ బంతివేయడమే పాపమన్నట్టు బౌండరీలకు తరలించారు. ఇక అలెక్స్ హేల్స్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడి దాటికి పాక్ బౌలర్లు చేతలుడిగి చూస్తుండిపోయారు. 122 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్లతో 171 పరుగుల చేసిన అలెక్స్ ఇంగ్లండ్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. అతడు అవుటయ్యాక కూడా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోరు తగ్గలేదు. జాస్ బట్లర్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 90 నాటౌట్), జో రూట్(85), ఇయాన్ మోర్గాన్(27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 57 నాటౌట్) చెలరేగి ఆడారు. వారి మెరుపు బ్యాటింగ్‌కు పాక్ బౌలర్లు నిస్సహాయులుగా మారిపోయారు. ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ దెబ్బకు పాక్ బౌలర్ రియాజ్ పది ఓవర్లలో ఏకంగా 110 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం 445 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 275 పరుగులకే చాపచుట్టేసి 169 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.

  • Loading...

More Telugu News