: ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటనకు ముహూర్తం ఖరారు... 2న ప్రకటించనున్న మోదీ?


ప్రత్యేక హోదా కోసం ఏపీ నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నా కాస్తయినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వంలో కదలిక మొదలైనట్టు కనిపిస్తోంది. తిరుపతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభ తర్వాత ‘ప్రత్యేక’ వేడి రాజుకోవడం, ఇంటా బయట ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఏదో ఒకటి తేల్చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని మరింత సాగదీయడం మంచిది కాదని భావిస్తున్న బీజేపీ ప్రభుత్వం మరో రెండు మూడు రోజుల్లో ప్రత్యేక హోదాపై కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చేనెల 3న ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో అంతకు ముందురోజు అంటే సెప్టెంబరు 2నే ఇందుకు సంబంధించి మోదీ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హోదాతోపాటు ఒనగూరే ప్రయోజనాలు, విభజన సమయంలో ఇచ్చిన హామీలపైన కూడా స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు సమాచారం. కాగా సోమ, మంగళవారాల్లో ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. హోదా, ప్యాకేజీపై రెండు విడతలుగా సుదీర్ఘ చర్చలు జరిపారు. హోదాతోపాటు రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రి వెంకయ్యనాయుడు తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News