: సునీల్ గవాస్కర్ కు అమెరికాలో చేదు అనుభవం... అతనెవరో అభిమానులు చెప్పినా వినని పోలీసులు!
వెస్టిండీస్ తో అమెరికాలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ కి వెళ్లిన ఇండియన్ క్రికెట్ లెజండ్ సునీల్ గవాస్కర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం నాడు లాడర్ హిల్ లో టీ-20 పోటీ ఆరంభానికి ముందు స్టేడియం వద్దకు వెళ్లిన ఆయన్ను లోపలికి వెళ్లనిచ్చేందుకు అక్కడి భద్రతాధికారులు అంగీకరించలేదు. ఈ ఘటన ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి రాగా, సన్నీ వద్ద సంబంధిత పాస్ లేకపోవడమే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేందుకు కారణమని తెలుస్తోంది. ఆయన్ను గుర్తించని భద్రతా సిబ్బంది స్టేడియం ముందే నిలిపివేయగా, అక్కడే ఉన్న అభిమానులు గవాస్కర్ ఎవరో చెప్పే ప్రయత్నం చేసినా పోలీసులు వినలేదు. దీంతో చేసేదేమీ లేక అభిమానులతో ఫోటోలు దిగుతూ, వారితో ముచ్చటిస్తూ ఉండిపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు వచ్చి చెప్పిన తరువాతనే గవాస్కర్ ను స్టేడియంలోనికి అనుమతించారు.