: ఇంకాస్త గ్లామర్ గా కనిపించే ఫోటోలు వాడొచ్చుగా?: మీడియాతో 18 ఏళ్ల నిందితురాలు!
"మీరు దయచేసి నేను పంపుతున్న ఈ ఫోటోలు వాడతారా? థ్యాంక్యూ. నన్ను కాస్త అందంగా చూపే చిత్రాలు వాడండి" అంటూ, ఓ ఆస్తి కేసులో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న 18 ఏళ్ల నిందితురాలు టీవీ చానళ్లకు ఫోటోలు పంపి విన్నవించుకుంది. ఓ కేసులో భాగంగా అమీ షార్ప్ అనే ఈ యువతి కోసం వెతుకుతున్న ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ పోలీసులు, ఆమెకు సంబంధించిన రెండు చిత్రాలను స్థానిక మీడియాకు విడుదల చేశారు. వీటిని టీవీ చానళ్లు ప్రసారం చేయగా, వాటిపై మొట్టమొదటిగా అమీ స్పందించడం గమనార్హం. తను మరింత గ్లామర్ గా కనిపిస్తున్న చిత్రాలను పంపిన ఆమె, తమపై కథనాలు ఇచ్చే వేళ, పాత చిత్రాలకు బదులుగా, తానిచ్చినవి వాడాలని, పోలీసులు ఇచ్చిన చిత్రాలు సరిగ్గాలేవని, వాటిని చూసి తాను అసంతృప్తికి గురయ్యానని చెప్పింది. ఇక అమీ చేసిన నేరం తీవ్రత ఎంతన్నది తెలియకున్నా, ఆమె వ్యాఖ్యలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. దాదాపు 47 వేల మంది ఆమె పోస్టింగ్ పై స్పందించారు. కాగా, చిత్రాలను పోస్ట్ చేసిన ఐపీ అడ్రస్ ఆధారంగా విచారించిన పోలీసులు అమీని అరెస్ట్ చేశారు. ఆమె వల్ల ప్రజలకు ఎలాంటి రిస్క్ లేదని, కేవలం ఆస్తి కేసులోనే ఆమెను కస్టడీలోకి తీసుకున్నామని వెల్లడించారు. వికారంగా కనిపించే పోటోలను చూపించి కూడా నిందితులను బయటకు రప్పించవచ్చని మెల్ బోర్న్ పోలీసులు నిరూపించారంటూ నెట్టింట సెటైర్లు వస్తున్నాయి.