: వైసీపీలో చేరికకు సిద్ధమవుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్?
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పార్టీ మారేందుకు సిద్ధమైపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితం ప్రారంభించిన ఉండవల్లి... మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. తదనంతర కాలంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి కూడా ఆయన కుడిభుజంలా వ్యవహరించారు. వైఎస్ అకాల మరణం నేపథ్యంలో తెలుగు నేలలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటం, తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా చీలిపోవడం జరిగిపోయాయి. అదే సమయంలో ఉండవల్లి కాంగ్రెస్ కి బై చెప్పి, కిరణ్ కుమార్ రెడ్డి వెంట నడిచారు. తాజాగా మళ్లీ తెరముందుకు వచ్చిన ఉండవల్లి... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీ వైపు చూశారు. విషయాన్ని పసిగట్టిన జగన్ కూడా రాజమండ్రి దాకా వెళ్లి ఉండవల్లిని పలుకరించి వచ్చారు. ఉండవల్లి వైసీపీలోకి వెళ్లిపోతున్నారని నాడే వదంతులు వినిపించినా... గడచిన రెండు రోజులుగా ఈ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదాపై తనదైన శైలిలో వాగ్బాణాలు సంధిస్తున్న ఉండవల్లి వ్యాఖ్యలను జగన్ కుటుంబం ఆధ్వర్యంలోని ‘సాక్షి’ ఛానల్ ప్రధానంగా ప్రసారం చేస్తోంది. వెరసి ఉండవల్లి వైసీపీలో చేరికకు సమయం ఆసన్నమైందన్న విశ్లేషణలు మరింతగా పెరిగాయి.