: ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు గడువిస్తున్నాం.. తర్వాత 13 జిల్లాల నాయకులతో సమావేశం నిర్వహిస్తాం!: ముద్రగడ పద్మనాభం
సెప్టెంబర్ 11న రాజమండ్రిలో 13 జిల్లాల నాయకులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఖమ్మంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ జాతిని నమ్మించి ఓట్లు వేయించుకుని చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు చీటింగ్ చేయాలని చూస్తే, తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు గడువిస్తున్నామన్నారు. తామిచ్చిన గడువు లోగా రిజర్వేషన్లపై ప్రకటన చేయకుంటే వచ్చే నెల నుంచి తమ కార్యాచరణను ప్రారంభిస్తామన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా కోసం, తాను కులం కోసం పోరాడుతున్నామని ముద్రగడ పేర్కొన్నారు.