: కేసీఆర్ అన్‌పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నారు.. సీఎం హోదాలో హుందాగా వ్యవహరించాలి: షబ్బీర్ అలీ
తమపార్టీ నేతలను విమర్శిస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ కోసం రాష్ట్ర ప్రజలు చేసిన పోరాటం కేసీఆర్ కుటుంబం కోసమా? అని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో పాలసీలపై ప్రశ్నించే హక్కు, వ్యతిరేకించే హక్కు ప్రతిపక్షాలకు ఉందని సుప్రీంకోర్టు తమిళనాడు ముఖ‌్యమంత్రి జయలలితకు ఇటీవలే చెప్పిన విషయం కేసీఆర్‌కి తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర సర్కారు చేపడుతోన్న పథకాలు తమకు అందడం లేదని ప్రజలు వాపోతున్నారని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కేసీఆర్ అన్‌పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నారని.. సీఎం హోదాలో హుందాగా వ్యవహరించాలని షబ్బీర్ అలీ విమర్శించారు. జైలుకి వెళ్లడం కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. దమ్ముంటే జైల్లో పెట్టండి అని ఆయన వ్యాఖ్యానించారు. మీ కుటుంబం మొత్తం ఏం చేసినా మాట్లాడొద్దా? అని ఆయన ప్రశ్నించారు. 2019 తరువాత కేసీఆర్ కుటుంబం జైలుకి పోవడం ఖాయం అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులుకాదు.. 15 రోజులు నిర్వహించాలని ఆయన సూచించారు