: ‘రియో’లో టినూ ఓటమికి కారణం పీటీ ఉషే.. మాజీ పరుగుల రాణిపై విరుచుకుపడిన టినూ అంకుల్ జోయిచన్


రియో ఒలింపిక్స్‌లో అథ్లెట్ టిను లుకా ఓటమికి ఆమె కోచ్ పీటీ ఉషానే కారణమని ఆమె మామ జోయిచన్ ఆరోపించారు. సరైన కోచింగ్ లేకపోవడం వల్లే ఆమె రియోలో ఓటమి పాలైందని అన్నారు. మాజీ పరుగుల రాణి పీటీ ఉష ప్రస్తుతం టినూకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆమె కోచింగ్ సెంటర్ ముసుగులో వ్యాపారం చేసుకుంటున్నారని జోయిచన్ ఆరోపించారు. కోచింగ్ సెంటర్‌లో అంతర్జాతీయ ప్రమాణాల ఊసే లేదన్నారు. సరైన వసతులు కూడా లేవని పేర్కొన్నారు. అంతేకాక టినూకు సౌకర్యాలు కల్పించేందుకు ఆమె నిరాకరించారన్నారు. రియోలో టినూ ఓటమికి ముమ్మాటికీ ఉషే కారణమన్నారు. 2014లో జరిగిన ఆసియన్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన టినూ రియలో 800 మీటర్ల పరుగు పందెంలో ఆరో స్థానంలో నిలిచి పరాజయం పాలైంది. 2:00:50 గంటల్లో పరుగు పూర్తి చేసి మొత్తంగా 29వ స్థానంలో నిలిచింది. 1984లో లాస్‌ఏంజెలెస్‌లో నిర్వహించిన ఒలింపిక్స్‌లో పీటీ ఉష తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News