: చిట్టి 'అమ్ము'...తమిళనాట 'అమ్మ'గా మారిన క్రమంపై పుస్తకం...7న విడుదల


పురుషాధిక్య భారత రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు ముఖ్యంగా నలుగురు మహిళల పేర్లు ముందుగా చెబుతారు. ఉక్కు మహిళ మాజీ ప్రధాని ఇందిరా గాందీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి... ఈ నలుగురూ అప్పటి వరకు ఉన్న సంప్రదాయాలను బద్దలు కొట్టుకుని మరీ దేశరాజకీయ ముఖచిత్రంపై మెరిశారు. రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. వీరిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్థానం చిత్రమైనది. సంప్రదాయాలకు నిలయమైన తమిళ బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబంలో జన్మించిన కోమలవల్లి... చిన్నతనంలో అందరితో 'అమ్మూ' అని ముద్దుగా పిలిపించుకుంది. మైనారిటీ తీరకముందే సినీ రంగంలో పరిణతి చెందిన పాత్ర పోషించి శభాష్ అనిపించుకుంది. తరువాత తన కంటే 30 ఏళ్ల పెద్దవాడైన ఎంజీఆర్ తో అనుబంధం ఏర్పర్చుకుంది. ఎంజీఆర్ మరణానంతరం ఆయన ఆశయ సాధనకు ప్రత్యేక పార్టీని స్థాపించి, ఒంటి చేత్తో పార్టీని నడిపిన ధీర వనిత ఆమె. ఈ క్రమంలో మదపుటేనుగుల్లాంటి మగాళ్లతో తలపడ్డారు. ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఈ క్రమంలో ఏటికి ఎదురీదుతూ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. మీసం మెలేసే మగాళ్లంతా ఆమె ముందు సాగిలపడి నమస్కారం పెట్టే స్థాయిని సంపాదించుకున్నారు. 68 ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో పని చేస్తూ ప్రజల అభిమానం చూరగొంటున్నారు. సంప్రదాయాలకు ఆలవాలమైన తమిళనాట వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన రెండో నేతగా, తొలి మహిళగా ఆమె చరిత్ర నెలకొల్పారు. బొద్దుగా, ముద్దుగా ఉండే చిన్నారి అమ్ము... అమ్మగా మారిన క్రమంపై ప్రముఖ జర్నలిస్టు వాసంతి రచించిన పుస్తకం అమ్మ (జయలలిత: ఏ జర్నీ ఫ్రం మూవీ స్టార్ టు పొలిటికల్ క్వీన్) సెప్టెంబర్ 7న విడుదల కానుంది. 200 పేజీల ఈ పుస్తకం ధర 299 రూపాయలని ఆమె చెప్పారు. ఆ రోజు నుంచి అమెజాన్ లో కూడా దొరుకుతుందని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News