: నాడు పాండవులకు అండగా శ్రీకృష్ణుడు... నేడు ఏపీ ప్రజలకు చంద్రబాబు!: ఏపీ మంత్రి నారాయణ కామెంట్!
టీడీపీ సీనియర్ నేత, ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ... తమ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి సంబంధించి ఆసక్తికర కామెంట్లు చేశారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని నేటి ఉదయం నెల్లూరులోని ఇస్కాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రభుత్వ రథాన్ని విజయపథంలో నడుపుతున్నారన్న కోణంలో నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. మహా భారతంలో పాండవులకు అండగా శ్రీకృష్ణుడు నిలవగా, ప్రస్తుతం ఏపీ ప్రజలను చంద్రబాబు అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని నారాయణ చెప్పుకొచ్చారు.