: తిరుమల గెస్ట్ హౌస్ లోనే పవన్ కల్యాణ్!... కొండపైకి భారీగా తరలివస్తున్న అభిమానులు!
కర్ణాటకలోని కోలార్ లో జరిగిన గొడవలో చనిపోయిన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నిన్న తిరుపతి చేరుకున్న టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ తర్వాత తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లారు. వెంకన్న దర్శనం అనంతరం కొండపైనే అతిథి గృహంలో బస చేసిన ఆయన నేటి ఉదయం మరోమారు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆ తర్వాత గెస్ట్ హౌస్ కు వెళ్లిన ఆయన రేపటి వరకు కూడా తిరుమలలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రేపు తిరుపతిలో అభిమానులతో భారీ సభ నిర్వహించేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో తిరుమలకు క్యూ కట్టారు. నేటి మధ్యాహ్నానికి తిరుమల చేరుకునే అభిమానుల సంఖ్య భారీగా పెరగనున్నట్లు సమాచారం. అయితే గెస్ట్ హౌస్ నుంచి బయటకు రాకుండానే పవన్ కల్యాణ్ భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.