: గుర్గావ్ లో సామూహిక అత్యాచారం...వృద్ధ దంపతుల హత్య
గుర్గావ్ లో మరో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... హర్యాణాలోని గుర్గావ్ లో ఓ ఫాం హౌస్ ను ఓ కుటుంబ సభ్యులు లీజుకు తీసుకున్నారు. ఆ ఫాం హౌస్ లోకి చొరబడ్డ సాయుధులైన ఐదుగురు దుండగులు ఆ కుటుంబ సభ్యులను బెదిరించి, బంధించారు. అనంతరం కర్రలతో వారిపై దాడి చేశారు. అనంతరం వారిలో యువతి, మైనర్ బాలికను మరో గదిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత తాపీగా ఇంట్లో విలువైన వస్తువులన్నీ దోచుకుని, ఇంటి బయటి నుంచి తాళం వేసి పరారయ్యారు. గ్యాంగ్ రేప్ కు గురైన యువతి అతికష్టం మీద ఇంటి నుంచి బయటకు వచ్చి...స్థానికులకు విషయం వివరించి సహాయం చేయమని అర్థించింది. దీంతో స్థానికులు అక్కడికి చేరుకుని, తీవ్ర గాయాలైన నలుగురు కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన అనంతరం చికిత్స పొందుతూ వృద్ధ దంపతులు మృతి చెందారు. గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు వివిధ సెక్షన్లపై కేసులు నమోదు చేసి, వారి కోసం గాలింపు చేపట్టారు. కాగా, గ్యాంగ్ రేప్ ఘటనలు పెరిగిపోతుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.