: ఆధారాలుంటే సిట్ కు ఇవ్వు: నట్టి కుమార్ పై మండిపడ్డ నిర్మాత అశోక్ కుమార్
సినీ నిర్మాతల మండలిలో ఎప్పుడూ రెండు వర్గాలు ఎలక్షన్ లలో పోటీపడతాయని, తమ వర్గం గెలుస్తుందని, నట్టి కుమార్ వర్గం ఓటమిపాలవుతుందని అశోక్ కుమార్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నయీం అక్రమాల కేసులో సిట్ అధికారి లేదా ఇతర పోలీసు అధికారులు తన ప్రమేయాన్ని నిర్ధారించారా? అని మీడియాను ప్రశ్నించారు. ఎవరూ నిర్ధారించనప్పుడు మీరు వార్తలు ఎలా ప్రసారం చేశారని ఆయన నిలదీశారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే సిట్ కు ఇవ్వాలని ఆయన నట్టి కుమార్ కు సవాల్ చేశారు. తనకు భూములు లేవని ఆయన అన్నారు. చెన్నైలో సప్తపది ఉందని, వైజాగ్ లో భూములు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని, వైజాగ్ లో ఉడా వేలం వేసిన భూమి తప్ప, 2005లో గణేష్ కొనిపించిన పది ఎకరాల భూమి తప్ప ఇంకెక్కడ ల్యాండ్ ఉన్నా నిరూపించాలని ఆయన సవాలు విసిరారు. గతంలో సర్వీస్ ట్యాక్స్ విషయంలో తాను కష్టపడ్డప్పుడు డబ్బులు వసూళ్లు చేశానని ఆరోపించారని, ఇలా ఎన్ని నిరాధార ఆరోపణలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన తెలిపారు. ఈ ఆరోపణలతో తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యామని ఆయన చెప్పారు. తాను సినిమా నిర్మించి 11 ఏళ్లైందని, ఇప్పటికీ తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలకు తావివ్వకూడదని నిర్మాతల మండలి ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నానని ఆయన చెప్పారు.