: కిడ్నాప్ నాటకమాడి డబ్బులు కొట్టేద్దామనుకున్న భార్య ఆటకట్టించిన పోలీసులు


కిడ్నాప్ నాటకమాడి భర్త నుంచి పది లక్షలు కాజేద్దామని భావించిన భార్య ఆటను ముంబై పోలీసులు కట్టించారు. ముంబైలో 35 ఏళ్ల వివాహిత భర్తతో కలిసి కోచింగ్ సెంటర్ నిర్వహిస్తోంది. కోచింగ్ సెంటర్ ద్వారా సంపాదించిన మొత్తాన్ని భర్త ఆమెతో షేర్ చేసుకోవడం లేదని భావించిన ఆమె, భర్త నుంచి తనకు రావాల్సిన మొత్తాన్ని ఎలాగైనా సంపాదించాలని కిడ్నాప్ ప్లాన్ వేసింది. అందులో భాగంగా ఆమెను ఎవరో కిడ్నాప్ చేసినట్టు తాళ్లతో కట్టేసుకుని, హింసిస్తున్నట్టు ఫోటోలు భర్తకు పంపింది. పది లక్షల రూపాయలు ఇస్తేనే ఆమెను విడుదల చేస్తామని, లేని పక్షంలో ఆమె గురించి మర్చిపోవాలని హెచ్చరికలు చేసింది. దీంతో ఆమె భర్త మీరా రోడ్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. దీనిని ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు ఆరు టీమ్ లను ఏర్పాటు చేసి, గాలింపు చేపట్టారు. కేసులో ప్రధాన ఆధారమైన సెల్ ఫోన్ ను సిగ్నల్స్ ను ట్రేస్ చేశారు. ఆ మొబైల్ వున్న వ్యక్తి భుశావల్, కార్జాట్, కల్యాణ్, భన్ దూప్, ఖర్ స్టేషన్ల మధ్య మెట్రో రైళ్లలో తిరుగుతున్నట్టు గుర్తించారు. దీంతో మెట్రో స్టేషన్ల సీసీ పుటేజీని పరిశీలించడం ప్రారంభించారు. దీంతో ఆమెను మీరా రోడ్ స్టేషన్ లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తమకు 10 ఏళ్ల క్రితం వివాహం జరిగిందని, సంపాదన విషయంలో తన భర్త రహస్యంగా వ్యవహరిస్తుండడంతో కిడ్నాప్ డ్రామా ఆడానని ఆమె తెలిపింది. దీంతో తమ విలువైన సమయాన్ని దుర్వినియోగం చేసిన ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయడానికి నిర్ణయించారు.

  • Loading...

More Telugu News