: అభిమానం ఉండాలేగానీ, చంపుకునేంతగానా?: పవన్ కల్యాణ్
సినిమా హీరోలంటే అభిమానం ఉండాలే తప్ప, అది ఒకరిని ఒకరు చంపుకునేంతగా ఉండరాదని, అప్పుడది అభిమానమే కాదని హీరో పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం హత్యకు గురైన వినోద్ కుటుంబాన్ని ఈ ఉదయం పవన్ పరామర్శించాడు. అభిమానుల మధ్య పోటీ ఉండటం మంచిదేనని, అది హత్యలకు దారితీయడం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. వినోద్ ఓ అభిమాని అని భావించి మాత్రమే తానిక్కడికి రాలేదని, వినోద్ తనకు అంతకన్నా ఎక్కువని పవన్ కల్యాణ్ అన్నారు. సమాజానికి ఉపయోగపడే, మేలు చేయాలని భావించే ఓ వ్యక్తిని కోల్పోయామని అన్నారు. తాను చనిపోతానని తెలిసిన తరువాత, తన కళ్లను దానం చేయాలని కోరిన గొప్ప యువకుడు వినోద్ అని, ఆయన మరణం తరువాత కళ్లను వెంటనే తీయించి దానం చేసిన కుటుంబానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. వినోద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ, ఆ కుటుంబానికి అండగా ఉంటానని, ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచన ఉన్న జనసేన నవ యువకుడు దూరం కావడం తన మనసును కలచివేసిందని తెలిపారు.