: అమెరికా క‌ఠిన నిబంధ‌న‌ల ప్ర‌భావం.. ఆస్ట్రేలియా వైపు రూటు మార్చుకుంటున్న విద్యార్థులు.. అక్కడా వీసా దొరక్క ఇబ్బందులు!


అమెరికాలో ఉన్న‌త చదువులు కొన‌సాగించాల‌నుకుంటున్న తెలుగు విద్యార్థులు ఇప్పుడు త‌మ రూటుని మార్చుకుని ఆస్ట్రేలియాకి వెళ్లి చ‌దువుకోవాల‌నుకుంటున్నారు. ఇటీవలి కాలంలో తమ దేశంలోకి వచ్చే విదేశీ విద్యార్థులపై అమెరికా కఠిన నిబంధ‌న‌లు తీసుకురావ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఎంతో మంది తెలుగు విద్యార్థులు అమెరికాలో చ‌దువుకోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటుండ‌గా వారికి నిబంధ‌న‌లు అడ్డుప‌డుతున్నాయి. దీంతో, ఆస్ట్రేలియాలో తమ చ‌దువుని కొన‌సాగించాల‌నుకుని ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్థుల‌కూ వీసాలు అంద‌డం లేదు. ఒక‌వైపు త‌ర‌గ‌తులు ప్రారంభ‌మై పోతున్నా మ‌రోవైపు అమెరికాకు వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. అమెరికా వెళ్లాలనుకుంటోన్న విద్యార్థులపై విమానాశ్ర‌యాల్లో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించి అధికారులు వారిని అడ్డుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఆరునెల‌ల క్రితం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని అమెరికాకు బ‌య‌లుదేరిన విద్యార్థుల‌ను అధికారులు ఎయిర్‌పోర్టులోనే అడ్డుకొని తిప్పి పంపారు. నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా విద్యార్థులు అమెరికాలో పార్ట్‌టైమ్ జాబులు చేస్తున్నార‌ని అధికారులు వారిని అడ్డుకుంటుండ‌డంతో ఆ దేశానికి వెళ్ల‌డానికి తెలుగు విద్యార్థులు మ‌క్కువ చూప‌డం లేదు. దీంతో మ‌న విద్యార్థులు ఇక ఆస్ట్రేలియాలో త‌మ ఉన్న‌త చ‌దువుల‌ను కొన‌సాగించాల‌ని చూస్తున్నారు. ప్ర‌తి ఏడాది మన దేశం నుంచి 25 వేల మంది విద్యార్థులు అమెరికాకు వెళుతుంటే, వారిలో ఐదు వేల మంది తెలుగు విద్యార్థులేన‌ట‌. ఇక, అమెరికా పెడుతున్న నిబంధ‌న‌ల‌తో ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థులు ఈసారి 30 శాతం అధిక‌మ‌వుతార‌ని అంచ‌నా. నిజానికి ఆస్ట్రేలియాలో చ‌దువుకోవాలంటే అమెరికాలో కంటే ఫీజులు కాస్త అధికంగానే ఉంటాయి. కానీ ఆస్ట్రేలియాలో చ‌దువు తర్వాత రెండేళ్లు వ‌ర్క్‌ప‌ర్మిట్ ఇస్తారు. దీంతో అక్కడ ప‌నిచేసుకోవ‌చ్చ‌నే ఉద్దేశంలో విద్యార్థులు ఉన్నారు. ఆస్ట్రేలియాలో వారానికి 20 గంట‌లు పార్ట్‌టైమ్ ప‌ని చేసుకునే వీలు కూడా విద్యార్థులకు వుంది. ఈ వీలు అమెరికాలో లేదు. డిపెండెంట్ గా వెళ్లేవారు కూడా త‌మ జీవిత భాగస్వామి చ‌దువు పూర్త‌య్యేవ‌ర‌కు ఆస్ట్రేలియాలో జాబ్ చేసుకోవ‌చ్చు. అంతేగాక‌, వీసా జారీ విషయంలో విద్యార్థి ఆర్ధిక ప‌రిస్థితి కాకుండా, తాను సాధించిన‌ మార్కులు, కాలేజీల్లో పొందిన సీటును ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొని ఆస్ట్రేలియా వీసా మంజూరు చేస్తోంది. ఆస్ట్రేలియాలో సీటు సంపాందించిన విద్యార్థులు చాలామంది ఇప్పటికే విద్యా సంస్థ‌ల్లో ట్యూష‌న్ ఫీజుల‌ను చెల్లించారు. కొంతమంది ఆన్‌లైన్‌లో వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ వ‌ర‌కు ఆఫ్‌లైన్ ద్వారానే విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి వీలుండేది. నెల‌రోజుల్లోనే వీసా వ‌చ్చేసేది. అలాగే ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి వీసాలు అందాయి. అయితే, గ‌త నెల ఒక‌టో తేది నుంచి ఆన్‌లైన్ ప్ర‌క్రియ‌ను తీసుకొచ్చారు. అయితే దీనిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. తాను వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకొని 40 రోజుల‌వుతోంద‌ని, అయినా ఇంత‌వ‌ర‌కు త‌నకు వీసా అంద‌లేద‌ని ఓ విద్యార్థి మీడియాకు తెలిపాడు. ఈనెల 2 నుంచే త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని పేర్కొన్నాడు. తాను రూ.11 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసిన‌ట్లు ఆ విద్యార్థి తెలిపాడు. ఫీజు చెల్లించాక వీసా స‌మ‌స్య ఎదురైతే కనుక, తదుపరి సీజ‌న్ త‌ర‌గ‌తుల‌కు త‌మ అడ్మిషన్ ను వాయిదా వేసుకోవ‌చ్చ‌ని ప‌లువురు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్థుల వీసాకు మ‌రింత స‌మ‌యం ప‌డుతుంద‌ని ఆస్ట్రేలియా అధికారులు పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లో ఎంతో మంది విద్యార్థులు ఆస్ట్రేలియా వీసాల కోసం వేచి చూస్తున్నారు.

  • Loading...

More Telugu News