: ‘ధూమ్’ దొంగ, పోలీసు మారారు!... బాలీవుడ్ హిట్ సీక్వెల్ లో కింగ్ ఖాన్!
బాలీవుడ్ హిట్ ‘ధూమ్’ సీరీస్ లో నాలుగో చిత్రం త్వరలో సెట్స్ పైకి రానుంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధూమ్, ధూమ్-2, ధూమ్-3 చిత్రాలు భారీ హిట్స్ గా నిలిచాయి. ఈ చిత్రాల్లో సరికొత్త రీతిలో దొంగలు చోరీలకు పాల్పడితే... వారిని అంతే చాకచక్యంగా పట్టుకునే పోలీసుల కథ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తాజాగా ధూమ్-4 పేరిట రానున్న చిత్రంలో దొంగగా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించనున్నాడు. ధూమ్ లో జాన్ అబ్రహాం, ధూమ్-2లో హృతిక్ రోషన్, ధూమ్-3లో మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తమదైన శైలిలో రక్తి కట్టించారు. వీరి బాటలోనే తాజాగా ధూమ్-4లో దొంగగా నటించనున్న షారూక్ ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో భారీ మార్పు చోటుచేసుకుంది. ఇప్పటిదాకా వచ్చిన ‘ధూమ్’ చిత్రాల్లో దొంగలు వేరైనా... పోలీసు మాత్రం ఒక్కడే. అతడే చోటా బచ్చన్ అమితాబ్ బచ్చన్. అయితే తాజా సీక్వెల్ లో అతడికి గుడ్ బై చెప్పిన చిత్ర యూనిట్ అతడి స్థానంలో రణవీర్ సింగ్ ను ఎంపిక చేసింది. 2017 జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం.