: మహిళా రక్షణ అధికారిపై అత్యాచారం కేసులో నలుగురికి జీవిత ఖైదు


రక్షణ అధికారిణిపై గ్యాంగ్ రేప్ కేసులో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్‌డ్ క్రైమ్ యాక్ట్(ఎంసీఓసీఏ) కోర్టు నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2010లో జరిగిన ఈ దారుణ ఘటనపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులు దీపక్ జవాలే, అభయ్ పురీ, విజయ్ బడే, సునీల్ ఎఖండేలను దోషులుగా తేల్చింది. యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.5 లక్షల చొప్పున జరిమాన కూడా విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... ఏప్రిల్ 9, 2010న బాధితురాలు తన భర్త, కుమారుడు, మరో ఇద్దరితో కలిసి బీడ్ జిల్లాలోని పర్లి వైజ్‌నాథ్ ఆలయ సందర్శనకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఓ గ్రామంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం రాత్రి పుణె వైపుగా తమ ప్రయాణం కొనసాగించారు. వీరిని చూసిన దుండగులు తమ కారులో వెంబడించారు. చిందోరి గ్రామం వద్ద బాధితుల కారును అడ్డుకున్నారు. అందులోంచి అందరినీ బలవంతంగా కిందికి దించి దాడిచేశారు. అందులోని మహిళా అధికారిని తమ కారులోకి బలవంతంగా ఎక్కించి తమతోపాటు తీసుకెళ్లారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకున్నారు. తర్వాత నడుస్తున్న కారులోనే ఒకరి తర్వాత ఒకరుగా నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహ కోల్పోయిన ఆమెను రోడ్డు పక్కన పడేసి కారులో వెళ్లిపోయారు. ఈ కేసులో 34 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం నిందితులను దోషులుగా తేల్చి శిక్ష విధించింది.

  • Loading...

More Telugu News