: దావూద్ ఇబ్రహీంకి పాకిస్థాన్ లో ఆరు ఇళ్లున్నాయని నిర్ధారించిన ఐక్యరాజ్యసమితి
ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో ఉన్నాడని ఐక్యరాజ్యసమితి కూడా నిర్ధారించింది. దీంతో పాకిస్థాన్ ఇరుకునపడక తప్పేలా కనిపించడం లేదు. కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను కూడా నడిబొడ్డున దాచి, తమ దేశంలో లేడని అప్పట్లో పాకిస్థాన్ బొంకిన సంగతి, ఆ తర్వాత అతనిని అమెరికా అక్కడే మట్టుబెట్టిన సంగతి విదితమే. అందుకే, పాక్ వాదనను ప్రపంచ దేశాలు నమ్మే పరిస్థితి లేనప్పటికీ, జమ్మూకాశ్మీర్ బూచిని చూపి భారత్ ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టేందుకు చైనాతో కలిసి పాకిస్థాన్ తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ముంబై పేలుళ్ల దోషి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో ఉన్నాడని భారత్ ఆరోపించిన ప్రతిసారీ, దానిని ఖండిస్తూ, సాక్ష్యాలు ఇవ్వాలంటూ పాక్ మెలికపెడుతుండేది. దీంతో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్రంగా శ్రమించి, పాక్ లో సురక్షితంగా ఉన్న దావూద్ ఇబ్రహీం ఇళ్లను గుర్తించి, వీడియో తీసి మరీ పాకిస్థాన్ తో పాటు, ఐక్యరాజ్యసమితికి కూడా అందజేశాయి. అందులో పాకిస్థాన్ లో 9 నివాసాలు దావూద్ ఇబ్రహీంకి సంబంధించినవని, వాటి నుంచే భారత్ లో అరాచకాలకు ఆదేశాలిస్తున్నాడని తెలిపింది. వీటిపై ఐక్యారాజ్యసమితి ప్రతినిధి బృందం నిశితంగా పరిశీలించి, నిఘా వేసి భారత్ సమర్పించిన నివేదికలో వాస్తవాలు ఉన్నాయని నిర్ధారించింది. భారత్ సమర్పించిన 9 అడ్రస్ లలో 6 సరైనవేనని నిర్ధారించింది. ఈ 6 నివాసాలు కరుడుగట్టిన మాఫియా డాన్ వేనని తేల్చింది. భారత్ లో 1993 బాంబు పేలుళ్లు, 2008 ముంబై పేలుళ్లతో పాటు ఇతర ఘటనల్లో డీ గ్యాంగ్ హస్తం ఉందని, భారత ఇంటెలిజెన్స్ తో పాటు రష్యా ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా ఆధారాలు సేకరించాయి. బుర్హాన్ వని మరణానంతరం సంభవించిన అల్లర్లను క్యాష్ చేసుకుందామని భావించిన పాక్ కు, బెలూచిస్థాన్, గిల్గిత్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లలో చెలరేగిన అల్లర్లను ప్రపంచం ముందుకు తీసుకొచ్చి సమాధానం చెబుతామని భారత్ అంటున్న వేళ...దావూద్ అడ్రస్ నిరూపణ కాస్త ఇబ్బందికర పరిణామమే...మరి పాకిస్ధాన్ ఇప్పుడేమంటుందో చూడాలి.