: నయీమ్ పై సినిమా తీస్తా!... రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన!


వివాదాస్పద ప్రకటనలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న బాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా సంచలనాత్మక ప్రకటన చేశారు. తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసుల చేతిలో హతమైపోయిన గ్యాంగ్ స్టర్ నయీమ్ పై తాను ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆయన నేటి ఉదయం ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నయీమ్ జీవిత చరిత్ర ఆధారంగా తాను ఓ చిత్రాన్ని తీయనున్నట్లు వెల్లడించిన ఆయన... సదరు చిత్రాన్ని మూడు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘వివిధ వర్గాల నుంచి నయీమ్ కు సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించాను. కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగిన అతడి నేరాలు రోమాంచితంగా ఉన్నాయి. నక్సలైట్ నుంచి ఇన్ఫార్మర్, అక్కడనుంచి గ్యాంగ్ స్టర్ గా రూపాంతరం చెందిన తీరు ఆసక్తిగొలిపేదే. ఆ తర్వాత అతడు నెంబర్ వన్ క్రిమినల్ గా మారిన తీరు భీతిగొలిపేదే. నయీమ్ స్టోరీ చాలా సంక్లిష్టంగా ఉంది. దీనిని ఒకే సినిమాలో చెప్పడం కష్టం. అందుకే నయీమ్ స్టోరీని మూడు భాగాలుగా చిత్రీకరించాలని నిర్ణయించా. రక్త చరిత్ర రెండు భాగాలుగానే వచ్చింది. నయీమ్ చిత్రం మాత్రం మూడు భాగాలుగా వస్తుంది’’ అని రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లలో వెల్లడించారు.

  • Loading...

More Telugu News