: వాట్సప్, ఫేస్‌బుక్ మెసేంజర్, స్నాప్‌చాట్‌లకు పోటీగా గూగుల్ ‘అల్లో’ యాప్!.. ప్రత్యేక ఆకర్షణలతో విడుదలకు సిద్ధం
స్మార్ట్ ఫోన్‌ల వినియోగదారులను ఆకర్షిస్తూ గూగుల్ సంస్థ ఇటీవల విడుదల చేసిన వీడియో కాలింగ్ యాప్ ‘డుయో’ అత్యధిక డౌన్‌లోడ్‌లతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ముందున్న ఫేస్‌బుక్ మెసెంజర్, పోకేమాన్‌గో యాప్‌లను వెనక్కినెట్టిన ‘డుయో’ టాప్ ప్లేస్‌లో నిలిచింది. మొబైల్‌లలో టెక్నాలజీ వాడకాన్ని గుర్తిస్తోన్న గూగుల్ కొత్తకొత్త ఫీచర్‌లతో ఇప్పటివరకు ఉన్న అప్లికేషన్లను వెనక్కి నెట్టుతూ ముందుకు దూసుకుపోయే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ‘డుయో’ను విడుదల చేసిన గూగుల్.. మరో యాప్‌ను స్మార్ట్ ఫోన్ వినియోగదారుల ముందుకు తీసుకువస్తోంది. స్మార్ట్ ఫోన్‌లలో చాటింగ్ కోసం ఉపయోగించే వాట్సప్, ఫేస్‌బుక్ మెసెంజర్, స్నాప్‌చాట్‌ల మాదిరిగా ‘అల్లో’ పేరుతో గూగుల్ యాప్‌ను పలు ప్రత్యేక ఫీచర్ లతో విడుదల చేయనుంది. దీనిలో అనేక ప్రత్యేకతలున్నాయి. చాటింగ్ చేసేటప్పుడు పదాన్ని మొత్తం టైప్ చేయకముందే, కొన్ని అక్షరాలను టైప్ చేయగానే దానికి సరిపోలే అర్థవంతమైన పలు వాక్యాలు యాప్‌లో కనిపిస్తాయి. దీంతో యాప్ సూచించిన వాటిల్లో మనకు కావలసిన వాక్యాన్ని ఎంచుకుని సెండ్ చేయొచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో ఈ యాప్ ఆయా పదాలు, వాక్యాలను సూచిస్తూ పనిచేస్తుంది. వాట్సప్‌ను ఉపయోగించినట్లే గూగుల్ ‘అల్లో’కు కూడా మొబైల్ నంబర్ ఉపయోగించాలి. దీనిని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే గూగుల్ అకౌంట్ కూడా ఉండాలి. స్మార్ట్ ఫోన్ వినియోగదారుడు గూగుల్‌లో వెతికే విషయాలు, యూట్యూబ్‌లో చూసే వీడియోల ఆధారంగా ఈ యాప్‌లోని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వినియోగదారులు టైప్ చేయబోయే పదాలను అంచనా వేస్తుంది. ‘అల్లో’లో ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్‌లాగే టెక్స్ట్ మెసేజ్, ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు, గూగుల్ మ్యాప్‌లోని తమ లొకేషన్‌ను కూడా సన్నిహితులకు పంపుకోవచ్చు. గ్రూపులు క్రియేట్ చేసుకొని తమ వారిని కలుపుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో వున్నాయి. దీన్ని ప్రీ-రిజిస్టర్ చేసుకుంటే అల్లో విడుదల అవ్వగానే డౌన్‌లోడ్ లింక్‌తో నోటిఫికేషన్ వస్తుంది. దీంతో విడుదలయిన వెంటనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.