: సూర్యుడి కంటే 30 రెట్లు పెద్దదైన నక్షత్రాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు


సూర్యుడు మనకు అతి దగ్గరగా ఉన్న న‌క్ష‌త్రమ‌న్న విష‌యం తెలిసిందే. అతి పెద్ద‌ద‌యిన ఈ సూర్య‌గోళం భూమి కంటే 1.3 మిలియ‌న్ రెట్లు పెద్ద‌ది. అయితే సూర్యుడి క‌న్నా పెద్దదైన ఒక యువ న‌క్ష‌త్రం జాడ తెలిసింది. సూర్యుడి కంటే ఈ న‌క్ష‌త్రం ఏకంగా 30 రెట్లు పెద్ద‌గా ఉంటుంద‌ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ న‌క్ష‌త్రం భూమికి 11 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుందని వారు పేర్కొన్నారు. ఇది కూడా మ‌న పాలపుంత (కొన్ని కోట్ల న‌క్ష‌త్రాల స‌ముదాయం) గెలాక్సీలోనే ఉంద‌ని అంటున్నారు. దీనిపై శాస్త్ర‌వేత్త‌లు పరిశోధనలు జ‌రప‌నున్నారు. దాని ద్వారా భారీ తారల ఆవిర్భావ తీరును తెలుసుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. ఈ న‌క్ష‌త్రం ప్ర‌స్తుతం ఏర్పడే దశలోనే ఉందని, మాతృ పరమాణు మేఘం నుంచి పదార్థాలను సేకరిస్తోందని శాస్త్ర‌జ్ఞులు తెలిపారు. స‌మ‌గ్ర‌స్థాయిలో రూపుదిద్దుకొన్నాక దాని సైజు మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. మ‌న‌కు తెలిసిన‌ సూర్యుడి లాంటి చిన్న నక్షత్రాలు వాయువులు, ధూళితో కూడిన భ్రమణ వలయం నుంచి పుట్టుకొస్తాయి. ఇటువంటి భారీ న‌క్ష‌త్రాలు కూడా అదే రీతిలో పుట్టుకొస్తున్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. సూర్యుడి కన్నా కనీసం 8 రెట్లు పెద్దగా ఉన్న భారీ యువ న‌క్ష‌త్రాలను గురించి ప‌రిశోధ‌న జ‌ర‌ప‌డంలో అనేక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. వాటి ఆయుష్షు ఎంతో త్వ‌ర‌గా ముగిసిపోవ‌డ‌మే దీనికి కార‌ణం. ఈ కార‌ణంగానే మన పాలపుంత గెలాక్సీలోని 100 బిలియన్‌ నక్షత్రాల్లో ఇవి చాలా త‌క్కువ సంఖ్య‌లో క‌నిపిస్తాయి. తాజాగా భారీ న‌క్ష‌త్రాన్ని క‌నుగొన్న పరిశోధనకు నాయకత్వం వహించిన జాన్‌ ఇలీ మాట్లాడుతూ.. సూర్యుడు లాంటి ఒక సగటు నక్షత్రం ఏర్పడడానికి ఎన్నో లక్షల ఏళ్లు పట్టిందని పేర్కొన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద న‌క్ష‌త్రాలన్నీ ఏర్పడ‌డానికి లక్షల ఏళ్లు ప‌డుతుంద‌ని చెప్పారు. ఆయా న‌క్ష‌త్రాల్లో ఇంధనం కూడా వేగంగా మండిపోతుందని పేర్కొన్నారు. దీని కార‌ణంగానే అవి చాలా తక్కువ కాలం పాటే మనుగడలో ఉంటాయని చెప్పారు. ఇప్పుడు గుర్తించిన అతి పెద్ద తార‌తో భారీ యువ తారలపై పరిశోధన చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News