: సింధు కోసం ప్రత్యేక విమానం వెయిటింగ్!... మరికాసేపట్లో బేగంపేటలో ఫ్లైటెక్కనున్న స్టార్ షట్లర్!
రియో ఒలింపిక్స్ లో కాకలు తీరిన క్రీడాకారులంతా విఫలమైన సమయంలో భారత సత్తా చాటి బ్యాడ్మింటన్ లో రజత పతకాన్ని సాధించిన తెలుగు తేజం పీవీ సింధు... ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది. నిన్న హైదరాబాదు చేరుకున్న సింధుకు తెలంగాణ సర్కారు ఘన స్వాగతం పలికింది. శంషాబాదు ఎయిర్ పోర్టు నుంచి గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం దాకా ఆమెను ర్యాలీగా తీసుకెళ్లింది. తాజాగా ఏపీ సర్కారు ఆమెకు మరింత ఘనంగా స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేసింది. హైదరాబాదు నుంచి సిందును, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ ను విజయవాడకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు సర్కారు ఏకంగా ఓ ప్రత్యేక విమానాన్ని వినియోగిస్తోంది. ప్రస్తుతం సదరు విమానం హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్టులో వెయిట్ చేస్తోంది. మరికాసేపట్లో (ఉదయం 8.30 గంటలకు) సింధు, గోపీచంద్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ విమానం ఎక్కనున్నారు. ఇక ఈ ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకోగానే సింధు, గోపీచంద్ కు ఘన స్వాగతం పలికేందుకు ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లు చేసింది.