: మంచినీళ్లు లేవు... బతికి ఎలా బయటపడ్డానో నాకే తెలియదు: భారత అథ్లెట్ ఓపీ జైషా
రియో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత అథ్లెట్ ఓపీ జైషాకు మన అధికారులు కనీసం మంచినీరు కూడా అందించలేని దుస్థితి ఆలస్యంగా వెలుగు చూసింది. 42 కిలోమీటర్ల మారథాన్ లో పాల్గొన్న అనంతరం జైషా మూడు గంటల పాటు స్పృహలో లేదు. ఆ సమయంలో ఆమె గురించి పట్టించుకునేందుకు భారత మహిళల మారథాన్ కోచ్, మన అధికారులెవ్వరూ లేకపోవడం గమనార్హం. భారత్ కు అక్కడ స్టేషన్ ఉన్నప్పటికీ మంచి నీరు ఇచ్చే నాథుడే లేడని, తాను బతికి ఎలా బయటపడ్డానో తనకే ఆశ్చర్యంగా ఉందని జైషా వాపోయింది. ఆ సమయంలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉందని, మంచినీరు లేక విలవిలలాడిపోయానని చెప్పింది. ఈ సంఘటనపై కేంద్ర క్రీడల శాఖా మంత్రి విజయ్ గోయెల్ ను ప్రశ్నించగా, ఇటువంటి చిన్నచిన్న సంఘటనలు జరుగుతుండటం మామూలేనని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై క్రీడాభిమానులు, క్రీడాకారులు మండిపడుతున్నారు.