: ప్రైవేటు బస్సులు యథేచ్చగా తిరుగుతున్నాయి: ఖమ్మంలో జగన్ ఆవేదన
ఖమ్మం జిల్లాలో ప్రైవేటు బస్సు బ్రిడ్జిపై నుంచి కిందకు పడిపోయిన ఘటనలో బాధితులను వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఈరోజు ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న ఆయన అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రమాదంలో పదిమంది తమ ప్రాణాలను కోల్పోవడం విచారకరమని ఆయన అన్నారు. నెలరోజుల్లో అదే బ్రిడ్జ్ కింద రెండు ప్రమాదాలు జరిగాయని అన్నారు. ప్రభుత్వాలు ఇటువంటి ప్రమాదాలని చూసీచూడనట్లు వదిలేయకూడదని సూచించారు. ప్రైవేటు బస్సులు యథేచ్చగా తిరుగుతున్నాయని, అయినా ప్రభుత్వాలు వాటిపై చర్యలు తీసుకోవడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలే ప్రైవేటు బస్సుల వ్యాపారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే వాటిని అరికట్టలేకపోతున్నారని అన్నారు. యాక్సిడెంట్లు జరుగుతున్నా వాటిపై నిర్లక్ష్యధోరణి కనబరుస్తున్నారని చెప్పారు. ఇటువంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చూడాలని కేసీఆర్‌ని కోరుతున్నట్లు వ్యాఖ్యానించారు. మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని జగన్ అన్నారు. క్షతగాత్రులకు 50 వేల రూపాయలివ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు బస్సులో ప్రయాణించే వారికి ఇన్సూరెన్స్ వస్తుందని, దాన్ని కూడా ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా తాను రాజకీయాలపై మాట్లాడదలుచుకోలేదని వ్యాఖ్యానించారు.