: ఎస్సీ, ఎస్టీ అమ్మాయిలతో వివాహాల కోసం ఉరుకులు పెడుతున్న యూపీ యువ నేతలు
ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లా ఇగ్లాస్ అసెంబ్లీ నియోజకవర్గం. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఇక ఇదే నియోజకవర్గంలోని యువనేత రవీందర్ సింగ్, పోటీపడాలని రెండేళ్లుగా తన వంతు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇక నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో, షెడ్యూల్డ్ కులాల నుంచి ఓ మంచి అమ్మాయిని ఎంచుకుని వివాహం చేసుకుని ఆమెను పోటీలో నిలిపి, తన రాజకీయ వాంఛను నెరవేర్చుకోవాలన్న ప్రణాళికల్లో ఉన్నాడు. రూపాయి కట్నం తీసుకోబోనని అతను చెబుతుండగా, ఇప్పటికే ఓ 10 సంబంధాల వరకూ వచ్చినట్టు తెలుస్తోంది. ఒక్క రవీందర్ సింగ్ మాత్రమే కాదు. వివిధ పార్టీల నుంచి టికెట్లను ఆశించి, ఆపై నియోజకవర్గాల రిజర్వేషన్లతో అవకాశాలను కోల్పోయిన ఎందరో యువనేతలు ఇప్పుడు షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. మూడు నెలల క్రితం బీజేపీ నేత మేఘరాజ్, ఓ దళిత యువతిని పెళ్లాడాడు. "నా రాజకీయ కలను నా భార్యను పోటీలోకి దింపడం ద్వారా నెరవేర్చుకుంటా" అని ఆయన చెబుతుండటం గమనార్హం. అంతకుముందే ఆయన తన తొలి భార్యకు విడాకులు ఇచ్చాడు. విడాకులకు, రాజకీయాలకు సంబంధం లేదని మేఘరాజ్ అంటున్నారు. గతంలో ఇగ్లాస్ నుంచి పోటీపడ్డ రాష్ట్రీయ లోక్ దళ్ నేత హరిచరణ్ సింగ్, ఇప్పుడు తన భార్యను బరిలోకి దింపాలని భావిస్తున్నాడు. ఈయన 12 ఏళ్ల క్రితమే సులేఖా అనే ఎస్సీ మహిళను వివాహం చేసుకున్నాడు లెండి. గతంలో జనరల్ కోటాలో ఉండి, ఇప్పుడు రిజర్వ్ అయిన పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. యూపీలో మహిళలకు రిజర్వ్ అయిన స్థానాల్లో గెలిచిన వారు నామమాత్రమేనని, వారి భర్తలే రాజ్యమేలుతుంటారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.