: ఢిల్లీ జేఎన్యూలో ఘోరం... సినిమా సీడీ అడిగిన సహ విద్యార్థినికి మత్తుమందిచ్చి అఘాయిత్యం
న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీ క్యాంపస్ లోని హాస్టల్ గదిలో ఘోరం జరిగింది. 28 సంవత్సరాల విద్యార్థినికి మత్తుమందిచ్చిన సహ విద్యార్థి ఆమెను అత్యాచారం చేశాడు. తొలి సంవత్సరం పీహెచ్డీ చదువుతున్న తనను 'ఐసా' కార్యకర్త అన్ మోల్ రతన్ అత్యాచారం చేశాడని వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. తనకు 'సైరాత్' చిత్రాన్ని చూడాలని ఉందని, ఎవరి దగ్గరైనా సీడీ ఉందా? అని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ పెడితే, రతన్ నుంచి సమాధానం వచ్చిందని బాధితురాలు తెలిపింది. సీడీ తన వద్ద ఉందని మెసేజ్ పెట్టిన అతని మాటలను నమ్మానని, సీడీ ఇస్తానని చెప్పి, అతను ఉంటున్న బ్రహ్మపుత్రా హాస్టల్ కు తనను తీసుకువెళ్లాడని, ఆపై శీతలపానీయంలో మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడని ఆరోపించింది. విషయాన్ని ఎవరికైనా చెబితే హత్య చేస్తానని బెదిరించాడని పేర్కొంది. కేసును విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించగా, 'ఐసా' నుంచి అతనిని బహిష్కరిస్తూ నిర్ణయం వెలువడింది.