: కోచ్ ను ఎత్తి పడేసి, ఆపై భుజాలపైకి ఎత్తుకున్న 'స్వర్ణ' విజేత
రియో ఒలింపిక్స్ లో రెజ్లింగ్ ఫ్రీ స్టయిల్ 63 కేజీల విభాగంలో జపాన్ క్రీడాకారిణి రిసాకో కువాయి స్వర్ణ పతకం సాధించింది. 21 ఏళ్ల కువాయికి ఇది తొలి ఒలింపిక్స్ కావడమే కాకుండా, పసిడి పతకం సాధించడంతో రిసాకో ఆనందానికి అంతులేకుండా పోయింది. ఆ ఆనందాన్ని తనతో పంచుకోవడానికి వచ్చిన కోచ్ కజు హిటో ను రిసాకో అమాంతం ఎత్తి మ్యాట్ పై రెండు సార్లు పడేసింది. అనంతరం జాతీయ జెండాను పట్టుకున్న కోచ్ ను తన భుజాలపై కూర్చోబెట్టుకుని స్టేడియం అంతా కలియతిరిగింది. కాగా, రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ 63 కిలోల విభాగం ఫైనల్ మ్యాచ్ లో బెలరూస్ కు చెందిన మారియాపై 3-0 తేడాతో రిసాకో విజయం సాధించింది.