: శ్రీవారి ఆలయం ఎదుట శ్రీలంక అధ్యక్షుడికి చేదు అనుభవం... డిప్యూటీ ఈఓపై మండిపడ్డ ఎస్పీ జయలక్ష్మి
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు ఈ ఉదయం తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. స్వామివారి దర్శనానికి వచ్చిన ఆయన, అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ఆలయం ఎదుట 10 నిమిషాలకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది. ఆయన ప్రయాణించే వాహనం డ్రైవర్ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. ప్రొటోకాల్ ప్రకారం సిరిసేనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఆయనతో వచ్చిన సిబ్బందికి వెంటనే దర్శనం కల్పించలేదు. దీంతో స్వామి దర్శనానికి వెళ్లిన సిరిసేన డ్రైవర్ క్యూలైన్లోనే ఆగిపోయాడు. డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వేచి చూడాల్సి వచ్చింది. ఓ దేశాధ్యక్షుడు వేచి చూసేలా చేసిన ఆలయ అధికారుల తీరుపై ఆయన భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అర్బన్ ఎస్పీ జయలక్ష్మి మండిపడ్డారు. అక్కడే ఉన్న ఆలయ డిప్యూటీ ఈఓపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసుల మధ్య సమన్వయం కొరవడిందని, వెంటనే డ్రైవర్ ను బయటకు తీసుకు వచ్చే ఏర్పాట్లు చేయాలని అన్నారు. కాసేపటికి దర్శనం ముగించుకుని డ్రైవర్ బయటకు రాగా, అనంతరం సిరిసేన కాన్వాయ్ ముందుకు సాగింది.