: రాజస్థాన్ లో పాక్ ఐఎస్ఐ ఏజెంట్!... చాకచక్యంగా పట్టేసిన పోలీసులు!
భారత్ లో కల్లోలం సృష్టించడమే లక్ష్యంగా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పనిచేస్తోంది. ఏమాత్రం అవకాశం ఉన్నా భారత్ లోని వ్యక్తులను ఏజెంట్లుగా మార్చుకుని తన కుట్రలకు పదును పెడుతున్న ఐఎస్ఐ... వీలు కాని పక్షంలో ఏకంగా తమ దేశానికి చెందిన వ్యక్తులను భారత్ లోకి చొప్పిస్తోంది. ఇలా ఐఎస్ఐ పంపిన ఓ ఏజెంట్ ను రాజస్థాన్ పోలీసులు నిన్న పట్టేశారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ లోని ఓ హోటల్ లో బస చేసిన పాక్ జాతీయుడు, ఐఎస్ఐ ఏజెంట్ నంద్ లాల్ మేఘ్ వాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ లోని సంగాద్ జిల్లాకు చెందిన వాడిగా అతడిని గుర్తించారు. పాక్ నుంచి పక్కా వీసాతోనే ఈ నెల ప్రథమార్థంలో భారత్ వచ్చిన అతడు ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అతడి కోసం జల్లెడ పట్టారు. ఈ క్రమంలో జైసల్మేర్ లోని ఓ హోటల్ లో ఉన్న అతడిని పట్టేసిన పోలీసులు అతడు సేకరించిన భారత రక్షణ స్థావరాలకు చెందిన ఫొటోలు, సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు అతడిని జయపురకు తరలించినట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ యూఆర్ సాహూ చెప్పారు.