: మరోసారి ఎటువంటి పోరు లేకుండానే కాంస్యం సాధించిన ఒకుహరా
రియో ఒలింపిక్స్ లో భాగంగా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో ఎటువంటి పోరు లేకుండానే జపాన్ షట్లర్ ఒకుహరా కాంస్యపతకం కైవసం చేసుకుంది. నిన్న జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ తో తలపడ్డ చైనా క్రీడాకారిణి లీ ఝరయ్ ఓటమి పాలైంది.ఈ పోరులో లీ ఝరయ్ స్వల్పంగా గాయపడింది. అయితే, కాంస్య పతకం కోసం ఈరోజు సాయంత్రం జరగాల్సిన మ్యాచ్ లో గాయాల కారణంగా తాను ఆడలేకపోతున్నానని, విశ్రాంతి తీసుకోవాలని లీ ఝరయ్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో, లీ ఝరయ్ తో తలపడకుండానే జపాన్ ప్లేయర్ ఒకుహరా కాంస్య పతకం సాధించింది. కాగా, భారత షట్లర్ పీవీ సింధుతో నిన్న జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఒకుహరా వరుసగా రెండు సెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.