: పుట్టినరోజు కానుకగా తనతో గడపాలని వేధించాడు: మహిళా సీఈఓ ఫిర్యాదు
ఒక ప్రైవేటు కంపెనీలో వ్యాపార భాగస్వామి అయిన ఒక మహిళా సీఈఓను ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ఒక హెల్త్ కేర్ కంపెనీ ఎండీ అయిన బ్రిసీ జాన్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా సీఈఓ బొమ్మనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ మొత్తంలో పెట్టుబడిపెట్టి కంపెనీని స్థాపించామని, చీటికిమాటికి తన శరీరాన్ని తాకుతూ తనను లైంగికంగా వేధిస్తున్నాడని పేర్కొంది. కార్యాలయంలో, లిఫ్ట్ లో వెళుతున్నప్పుడు వేధింపులకు పాల్పడుతున్నాడని, గత నెల 21వ తేదీన తన పుట్టిన రోజు కానుకగా తనతో గడపాలని జాన్ కోరాడని ఆ ఫిర్యాదులో ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, జాన్, బాధిత మహిళ మంచి స్నేహితులని, వారు వ్యాపార పర్యటనల నిమిత్తం చెన్నై, త్రివేండ్రమ్ కలిసి వెళ్లారని, ఒకే హోటల్ లో కూడా వాళ్లిద్దరూ ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. బాధిత మహిళకు తన భర్తతో వివాదం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి సొంత కంపెనీ ఏర్పాటు చేశారని, బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఆ కంపెనీ ఎండీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.