: దీపా కర్మాకర్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రతిపాదన
జిమ్నాస్టిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తోన్న దీపా కర్మాకర్ పేరును ఇప్పుడు క్రీడారంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారమైన ఖేల్‌రత్న అవార్డుకు ప్రతిపాదిస్తున్నారు. దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్స్‌లో అద్భుతంగా రాణించి ఇండియా పేరును అంతర్జాతీయంగా నిలబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు ఖేల్ రత్న ప్రదానం చేయాలని క్రీడాశాఖ వర్గాలు అంటున్నాయి. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో దీపా కర్మాకర్‌కు జిమ్నాస్టిక్స్‌లో కాంస్యపతకం మిస్ అయి నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు షూటర్ జీతూరాయ్ పేరు కూడా ఖేల్ రత్న జాబితా రేసులో ఉన్నారు. దీపా కర్మాకర్ బాల్యదశలో ఉన్నప్పుడు ఆమెకు జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ ఇచ్చిన కోచ్ బిశ్వేశ్వర్ నందికి ద్రోణాచార్య అవార్డు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్రిపురలో ఓ పేదింట్లో పుట్టిన దీపా కర్మాకర్ పట్టుదలతో జిమ్నాస్టిక్స్‌లో సాధన కొనసాగించింది. తనను ప్రోత్సహించడానికి స్పాన్సర్ చేసేవాళ్లు ఎవరూ ముందుకు రాకపోయినా ఆమె తన సాధనను కొనసాగించింది. జిమ్నాస్టిక్స్‌లో అత్యంత ప్రమాదకరమైన ప్రోదునోవా విభాగంలో అద్భుతంగా రాణించింది. పేదరికంలో ఎన్నో ఇబ్బందులు పడుతోన్న ఆమె 2010లో కామన్‌వెల్త్ గేమ్స్ లోనూ పాల్గొంది. ఆ సమయంలో ఆమె పోటీలకు వెళ్లేటప్పుడు జిమ్నోవా అనే సంస్థ దీపాకి జిమ్నాస్టిక్స్ దుస్తులు అందించింది. ఆ దుస్తులనే ఆమె మూడు నెలల క్రితం వరకు ఉపయోగించింది. రెండు నెలల క్రితం జరిగిన రియో టెస్ట్ ఈవెంట్‌లో దీపా అర్హత సాధించింది. దీంతో స్పాన్సర్లు ఆమె తలుపులు తట్టారు. ఒలింపిక్స్‌లో రాణించిన ఆమె ప్రతిభను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అభినందించారు.