: ప్రధాని మాటలు ఆ చెవులకు ఎక్కలేదు... గుజరాత్ లో 20 మంది దళితులపై దాడి!.. 8 మందికి తీవ్ర గాయాలు
దళితులపై దాడులు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే హెచ్చరించినా ఆ చెవులకు ఎక్కలేదు. తాజాగా గుజరాత్ లోని ఉనాలో నిరసనలు తెలిపారన్న కారణంతో 20 మంది దళితులపై సమ్తార్ గ్రామం సమీపంలో దాడి జరిగింది. నిన్న సాయంత్రం ఉనాలో జరిగిన 'దళిత్ సమ్మేళన్' నిరసన ప్రదర్శనలో పాల్గొని స్వగ్రామాలకు వెళుతున్న వారిపై స్థానికులు కర్రలు, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో 20 మందికి గాయాలు కాగా, 8 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని తెలుస్తోంది. పోలీసులు చూస్తుండి కూడా తమను కాపాడేందుకు చర్యలు తీసుకోలేదని దళితులు ఆరోపిస్తుండగా, తాము టియర్ గ్యాస్ ప్రయోగించి దాడులు చేస్తున్న వారిని చెల్లాచెదురు చేశామని, లాఠీచార్జ్ కూడా జరిపామని పోలీసులు అంటున్నారు. భావ్ నగర్ జిల్లాకు చెందిన బాధితులు, ఉనాలో రోహిత్ వేముల తల్లి, కన్హయ్య కుమార్ తదితరులు పాల్గొన్న కార్యక్రమానికి వెళ్లి వస్తున్న వేళ ఈ దాడి ఘటన జరిగింది.