: బలూచిస్థాన్, పీవోకేలో మానవహక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతోందో ప్రపంచానికి తెలియాలి: వెంకయ్య
బలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లో మానవహక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతోందో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈరోజు ఢిల్లీలో ‘స్వచ్ఛభారత్‌లో ప్రజల భాగస్వామ్యం-జన ఉద్యమం’ కార్యశాలను ఆయన ప్రారంభించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని అన్నారు. పీవోకే, బలూచిస్థాన్‌లో కొనసాగుతున్న చర్యల గురించి అందరికీ తెలియాలని, దేశ భద్రత విషయంలో అన్ని పార్టీలు ఒకే గొంతుకగా వ్యవహరించాలని అన్నారు. కాంగ్రెస్ అలా వ్యవహరించకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేసేందుకే నూతన పధ్ధతులపై ‘స్వచ్ఛభారత్‌లో ప్రజల భాగస్వామ్యం-జన ఉద్యమం’ కార్యశాలలో చర్చిస్తామని వెంకయ్య తెలిపారు. కార్యశాలలో చేసిన సిఫార్సులను కేంద్రం ప్రజలకు తెలియజేస్తుందని చెప్పారు. కార్యశాలలో సదుపాయాల కల్పన, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తామని, పట్టణాల్లో చెత్త బయట వేసేవారిపై జరిమానా విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.